ప్రజాదర్బార్‌కు వేలమంది క్యూ... ఇంతమందిని కేసీఆర్‌ పట్టించుకోలేదా?

December 15, 2023


img

హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో ప్రతీ మంగళ, శుక్రవారాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ప్రజాదర్బార్‌లో సామాన్య ప్రజలతో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకొంటున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 

దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలివస్తుండటంతో ప్రజాభవన్ వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. నేరుగా ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి తమ గోడు చెప్పుకొంటే సమస్యలు తీర్చుతారనే ఆశతోనే దూరప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వస్తున్నామని క్యూలో నిలబడుతున్న ప్రజలు చెపుతున్నారు. 

వారిలో కొందరు గత 10 ఏళ్ళబట్టి స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎంఆర్వో తదితర ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని కానీ ఎవరూ తమ సమస్యలని పట్టించుకోలేదని చెపుతున్నారు. వారిలో కొందరు వృద్ధాప్య, ఒంటరి మహిళ పింఛన్ల కోసం వచ్చేవారున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ధరణిలో భూసమస్యలు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. 

ఇలా అనేక సమస్యలతో ప్రజలు ప్రజాభవన్‌ ముందు బారులు తీరుతుండటం గమనిస్తే గత పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో వారందరూ ఎంత నిర్లక్ష్యానికి గురయ్యారో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అర్దమవుతుంది. 

బిఆర్ఎస్‌ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రజల సమస్యలను గుర్తించి తీర్చడంలో విఫలమైనందునే, బిఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయింది. కానీ దాని వలన కేసీఆర్‌ చెడ్డపేరు, బిఆర్ఎస్‌ పార్టీకి రాజకీయంగా నష్టం వచ్చింది. 

కేసీఆర్‌ ప్రజలకు దూరం అయ్యారనే విషయం రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలు పలుమార్లు చెపుతూనే ఉన్నారు. కానీ వాటిని బిఆర్ఎస్‌ నేతలు తేలికగా కొట్టిపడేస్తూ, ప్రజలందరూ మావైపే ఉన్నారని వాదించేవారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవడం మంచిదే. కానీ తన వద్దకు వచ్చి అర్జీలు ఇస్తున్న ప్రజల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించగలిగినప్పుడే ఆయన పట్ల ప్రజలలో నమ్మకం ఏర్పతుంది. లేకుంటే ఇది తన పాపులారిటీ పెంచుకొనేందుకు చేస్తున్న డ్రామాగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మడం మొదలుపెడతారని మరిచిపోకూడదు.

గమనిక: ప్రజా దర్బార్ పేరుని ప్రజావాణిగా మార్చారు.  


Related Post