తెలంగాణ శాసనసభ ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ చేత ఎన్నికల ప్రచారం చేయించుకొన్న బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేసినా జనసేన పోటీ చేసిన 8 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయి నవ్వులపాలైంది.
మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అప్పుడే వాటి కోసం సన్నాహాలు ప్రారంభించారు. ఇవాళ్ళ ఉదయం నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, “2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలలో మన బలం పెరిగింది. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొనేందుకు ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేద్దాం. లోక్‌సభ ఎన్నికలలో మనం ఎవరితోను పొత్తులు పెట్టుకోవడం లేదు. ఒంటరిగానే పోటీ చేయబోతున్నాము,” అని కిషన్ రెడ్డి అన్నారు.
లోక్‌సభ ఎన్నికలలో ప్రధానంగా జాతీయ అంశాలు, కేంద్రంలో ఎవరు లేదా ఏ పార్టీ అధికారంలోకి రావాలనే దానిపైనే ప్రజలు తమ తీర్పు చెపుతారు. బహుశః అందుకే పవన్ అవసరం లేదని కిషన్ రెడ్డి అనుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ కలిసి పనిచేద్దామనుకొన్నా శాసనసభ ఎన్నికలలోనే దారుణంగా ఓడిపోయినప్పుడు కొన్ని శాసనసభ నియోజకవర్గాలతో కూడిన లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన పోటీ చేసి ప్రయోజనం ఉండదు. కనుక బీజేపీ నిర్ణయం పవన్ కళ్యాణ్‌కు కూడా సంతోషకరమే!