కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. కానీ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆమెకు తొలిసారిగా కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకొనేందుకు అవకాశం లభించింది. అదీ... తన చేతికి మట్టి అంటకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం చేసిన ఇచ్చిన ప్రసంగంతోనే!
ఈరోజు ఉదయం ఆమె ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “పదేళ్ళ నిరంకుశపాలన నుంచి ప్రజలు బయటపడినందుకు చాలా సంతోషిస్తున్నారు. పదేళ్ళ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరగడంతో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం వహించడం వలన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణంతో లక్షలాదిమంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో తెలంగాణ ప్రతిష్ట మంట కలిసిపోయింది. మేడిగడ్డ బారేజ్ కుంగిపోవడానికి కారణం కమీషన్ల కక్కుర్తే అని భావిస్తున్నామని, దానిపై తమ (కాంగ్రెస్) ప్రభుత్వం లోతుగా విచారణ జరిపిస్తుందని గవర్నర్ అన్నారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వ్రాసిచ్చిన ప్రసంగమే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజాదర్బార్, మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పధకాల అమలు గురించి గొప్పగా వర్ణించి వ్రాసుకొంది. ఆరు గ్యారెంటీలు తదితర హామీలను అమలుచేస్తుందని, ప్రజాస్వామ్యబద్దమైన, పారదర్శక పాలన అందిస్తామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.
సమావేశం ముగిసిన తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డారు. ఆమె ప్రసంగం కాంగ్రెస్ మానిఫెస్టోలా ఉందని అన్నారు. గవర్నర్ హోదాలో ఉన్న ఆమె శాసనసభ సాక్షిగా అబద్దాలు చెప్పారని వారు ఆరోపించారు. గత పదేళ్ళలో తెలంగాణ అభివృద్ధి చెందలేదనుకొంటే మరి కేంద్ర ప్రభుత్వం పదేపదే ఎందుకు ప్రశంశించింది?ఎందుకు అన్ని అవార్డులు ఇచ్చింది?అని ప్రశ్నించారు.
ఇదివరకు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడైతే వారి మాటలకు చాలా విలువ ఉండేది. కానీ ఇప్పుడు వారి వాదనలను పట్టించుకొనేవారు ఎవరు?అయినా గతంలో తమ పాలన అద్భుతంగా ఉందని వ్రాసిచ్చి ఆమె చేత శాసనసభలో చదివించుకొన్నప్పుడు తప్పుగా భావించని బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్రాసిచ్చిన ప్రసంగం చదివితే తప్పు పట్టడం దేనికి? బాధపడటం దేనికి? బాధపడి ప్రయోజనం ఏమిటి?