తెలంగాణలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇంతవరకు ప్రమాణస్వీకారమే చేయలేదు. కానీ అప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించేశారు. ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నందున మేము ప్రమాణస్వీకారం చేయలేదు. కానీ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు కనుక రేపు మేమందరం ప్రమాణస్వీకారం చేస్తాము.
అప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలవుతుంది. ఆరు గ్యారెంటీల గురించి ప్రచారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచింది. వాటిని అమలుచేయాలంటే వేలకోట్లు కావాలి. కానీ కేసీఆర్ ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పోయారు.
కనుక రేవంత్ రెడ్డి ఈ ఆరు గ్యారెంటీలని అమలుచేయడం కోసం ఇటలీ నుంచి డబ్బు తీసుకువస్తారా లేక కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగి తీసుకువస్తారా?అనేది మాకు అనవసరం. ఆరు గ్యారెంటీలను అమలుచేయాల్సిందే. లేకుంటే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటాలు మొదలుపెడతాము,” అని రాజాసింగ్ హెచ్చరించారు.
రాజాసింగ్ చెప్పింది నిజమే కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి పది రోజులు కూడా కాక మునుపే అప్పుడే ఆరు గ్యారెంటీల గురించి బీజేపీ, బిఆర్ఎస్ నేతలు నిలదీస్తుండటం సరికాదు. వారికి కొంత సమయం ఇచ్చి అమలుచేయలేకపోతే అప్పుడు నిలదీస్తే ప్రజలు కూడా వారితో ఏకీభవిస్తారు. కానీ ఇప్పటి నుంచే వాటి పేరుతో రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే, ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనే సానుభూతి ఏర్పడుతుందని గ్రహిస్తున్నట్లు లేదు.