సీతక్క మంత్రి అయితే కానీ ఆమె ఊరికి బస్సు రాలేదు!

December 14, 2023


img

తెలంగాణ ఏర్పడి పదేళ్ళు కావస్తోంది. అయినా ఇంతవరకు ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు బస్సు సౌకర్యం కల్పించనేలేదు. జగ్గన్నపేటకు మంచి రోడ్ కూడా ఉంది. కానీ బస్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు షేరింగ్ ఆటోలలోనే జిల్లా కేంద్రానికి వెళ్ళి వస్తుంటారు. 

ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని చాలాసార్లు టిఎస్‌ఆర్టీసీ అధికారులను, జిల్లా మంత్రులను కూడా కోరారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి, ఆమె పంచాయితీరాజ్ శాఖ మంత్రి పదవి చేపట్టడంతో టిఎస్‌ఆర్టీసీ అధికారులు ఆమె అడగకుండానే జగన్నపేట రూట్‌ని సర్వే చేసి త్వరలోనే బస్సు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అంటే ప్రజల అవసరాలను బట్టి కాకుండా, రాజకీయ నాయకుల నిర్ణయాలను బట్టి అధికారులు వ్యవహరిస్తారన్న మాట! ఏది ఏమైనప్పటికీ, ఇన్నేళ్ళ తర్వాత తొలిసారిగా తమ ఊరికి ఆర్టీసీ బస్సు వస్తుండటంతో జగ్గన్నపేట, పరిసర గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జిల్లాలో మారుమూల మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో నివసించే గిరిజనుల వద్దకు వెళ్ళి ఎంతో సేవలు చేసేవారు. ముఖ్యంగా కరోనా, లాక్‌డౌన్‌, తుఫాను సమయాలలో ఆమె చేసిన సేవల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది.

అందుకే స్వయంగా కేసీఆర్‌ వచ్చి బిఆర్ఎస్ అభ్యర్ధికి ఓటు వేయమని విజ్ఞప్తి చేసినా ములుగు నియోజకవర్గంలో ప్రజలు మళ్ళీ ఆమెనే గెలిపించుకొన్నారు. ఇప్పుడు మంత్రిగా ఆమె ములుగు జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభించింది. 


Related Post