రాయదుర్గం-ఎయిర్ పోర్ట్ మెట్రో పనులకు రేవంత్‌ రెడ్ సిగ్నల్!

December 14, 2023


img

గత ప్రభుత్వ హయాంలో రాయదుర్గం-ఎయిర్ పోర్ట్ మెట్రో పనులకు మాజీ సిఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసి టెండర్ల ప్రక్రియని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ పనులు నిలిపివేసి వేరే మార్గంలో మెట్రోని విమానాశ్రయానికి కలిపేందుకు సర్వే చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

చాంద్రాయణ గుట్ట-మైలార్ దేవ్‌పల్లి-జల్‌పల్లి- పి7 రోడ్డు మీదుగా లేదా చాంద్రాయణ గుట్ట-బార్కస్-పహాడీ షరీఫ్-శ్రీశైలం రోడ్డు మీదుగా విమానాశ్రయానికి మెట్రో కారిడార్ ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఈవిదంగా చేస్తే పాత బస్తీ-నగరంలో కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాల మద్య కనెక్టివిటీ పెరుగుతుందని, ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుందని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ రెండు మార్గాలలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మార్గంలో మెట్రో నిర్మిద్దామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. 

ఎంజీబిఎస్ నుంచి పాతబస్తీ పరిధిలోని ఫలక్‌నుమా వరకు 5.5 కిమీ మెట్రో కారిడార్ ఏళ్ళ తరబడి పూర్తిచేయకపోవడంపై సిఎం రేవంత్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మూసీ కారిడార్‌లో నాగోలు నుంచి ఎంజీబిఎస్ మీదుగా గండిపేట వరకు ఈస్ట్, వెస్ట్, రోడ్ కమ్ మెట్రో రైలు ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలని సూచించారు. 


Related Post