.పది జిల్లాలలో హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలుగా విభజించి పునర్వ్యవస్థీకరించారు. వాటితో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లు, పంచాయతీలను కూడా పునర్వ్యవస్థీకరించారు. తెలంగాణ జనాభా, అవసరాలకు అనుగుణంగా జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. ఆ ప్రకారం వ్యవస్థలు, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, పోలీస్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఇప్పుడిప్పుడే కుదురుకొంటున్నాయి.
ఇప్పుడు మళ్ళీ వాటిని పునర్వ్యవస్థీకరిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బాంబు పేల్చారు. బుధవారం హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ అత్యంత నిర్లక్ష్యానికి గురైంది.
కేసీఆర్ ప్రభుత్వం గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసింది. అసలు ఇంతవరకు కాలువలు కూడా నిర్మించలేదు. ఇక తోటపల్లి భూనిర్వాసితులను కేసీఆర్ పట్టించుకోకపోగా మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే వారిపట్ల చాలా దురుసుగా ప్రవర్తించేవారు.
ప్రజాభీష్టానికి అనుగుణంగా జిల్లాలు, మండలాల పునర్విభజన జరగకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలన్నిటినీ మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇస్తున్నాను. త్వరలోనే సిఎం రేవంత్ రెడ్డితో వీటి గురించి చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలు, మండలాలు పునర్వ్యవస్థీకరణకు పూనుకొంటే తేనెతుట్టెని కదిలించిన్నట్లే అవుతుంది. కనుక హుస్నాబాద్ నియోజకవర్గానికే ఈ మార్పులు చేర్పులు చేస్తే మంచిది.