తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడున్న రోజునే అంటే డిసెంబర్ 7వ తేదీనే ఆర్మూర్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి విద్యుత్ శాఖ, టిఎస్‌ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. సుమారు 2.50 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించనందుకు ఆర్మూరులోని ఆయన కుటుంబానికి చెందిన జీ1 షాపింగ్ మాల్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆయన ఆ షాపింగ్ మాల్‌ని టిఎస్‌ఆర్టీసీకి చెందిన స్థలాన్ని 33 ఏళ్ళకు లీజుకి తీసుకొని నిర్మించుకొన్నారు. కానీ లీజు బకాయిలు సుమారు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆదేరోజున టిఎస్‌ఆర్టీసీ అధికారులు కూడా లీజ్ బకాయిలు చెల్లించకపోతే షాపింగ్ మాల్ స్వాధీనం చేసుకొంటామని తెలియజేసారు.
తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఆయనకు నోటీస్ పంపించింది. ఆయన 2017లో తన భార్య రజితా రెడ్డి పేరున రూ.20కోట్లు రుణం తీసుకొన్నారు. కానీ ఇంతవరకు తిరిగి చెల్లించలేదు. వాయిదాలు కూడా కట్టడం లేదు. కానీ గతంలో ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందున అధికారులు ఆయనను అడగలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది గనుక తక్షణం రూ.20కోట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, లేకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తూ నోటీస్ పంపించారు.
అయితే ఒక్క జీవన్ రెడ్డి లేదా మరో మంత్రి లేదా ఎమ్మెల్యే మాత్రమే ఈవిదంగా చేశారనుకోవడానికి లేదు. దాదాపు అందరూ ఈవిదంగానే చేస్తుంటారు. సామాన్యులు పదివేలు రుణం తీసుకొని చెల్లించకపోతే ఇళ్ళ మీదకు వచ్చేసే అధికారులు, అధికార పార్టీ నేతలు ఇన్నిన్ని కోట్లు అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకపోయినా వసూలు చేసుకోలేకపోతున్నారు. కనీస అడిగే సాహసం కూడా చేయలేకపోతున్నారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేతలనే కాకుండా తన సొంత పార్టీ నేతలను కూడా ఈవిదంగా చేయకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది.