మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్ పేరుని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆయనకు ఓ విచిత్రమైన సమస్య ఎదురవుతోంది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ,ఆ పదవిలో ఉన్నంతకాలం ఉజ్జయినిలో రాత్రిపూట ఉండేందుకు వీల్లేదు. ముఖ్యమంత్రికి ఇటువంటి ఆంక్షలు పెట్టగలవారు ఎవరనుకొంటున్నారా? సాక్షాత్ ఉజ్జయిని మహాకాళేశ్వరుడే.
దేశానికి, రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నప్పటికీ ఉజ్జయినీ నగరాన్ని పాలించేది ఆ మహాకాళేశ్వరుడే అని ప్రజల ప్రగాడ విశ్వాసం. కనుక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు పగలు ఉజ్జయినీలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించుకొన్నా అభ్యంతరం ఉండదు. కానీ రాత్రిపూట ఉజ్జయినిలో ఎవరూ బస చేయరు. ఒకవేళ తప్పనిసరి అయితే నగర పొలిమేరకు అవతల సుమారు 15కిమీ దూరంలో బస చేస్తుంటారు. రాజా విక్రమాదిత్య కాలంలో ఈ ఆనవాయితీ ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటికీ ఇదే కొనసాగుతోంది. దీనినే ‘మహాకాళేశ్వర్ గార్డ్ ఆఫ్ హానర్’గా స్థానికులు చెప్పుకొంటారు.
ఒకవేళ ఈ ఆనవాయితీని పట్టించుకోకుండా రాత్రిపూట ఉజ్జయినిలో బస చేస్తే వారి పదవులు పోగొట్టుకొంటారు. దివంగత ప్రధాని మొరార్జీ దేశాయ్, కర్ణాటక మాజీ సిఎం యడియూరప్ప ఈవిదంగానే పదవులు కోల్పోయారని ప్రజలు విశ్వసిస్తుంటారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోహన్ యాదవ్ కూడా ఈ ఆనవాయితీని గౌరవిస్తారు. ఉజ్జయినీకి వచ్చినప్పుడు ఆయన పగలు తన సొంత ఇంట్లో ఉండవచ్చు కానీ చీకటి పడిన తర్వాత నగరంలో ఉండకూడదు. కనుక ఆయన ఉజ్జయినికి వచ్చినప్పుడు రాత్రిపూట బస చేసేందుకుఅధికారులు నగరం వెలుపల క్యాంప్ కార్యాలయం సిద్దం చేస్తున్నారు.