రేవంత్‌ రెడ్డి తర్వాత టార్గెట్... బెల్ట్ షాపులు!

December 13, 2023


img

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి తొలిసారిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎంతో పరిపాలనానుభవం ఉన్నవారిలా వివిద శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసపెట్టి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ చకచకా నిర్ణయాలు తీసుకొంటుండటం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

మొదట విద్యుత్ శాఖపై సమీక్ష, తర్వాత టిఎస్‌పీఎస్సీపై సమీక్షా సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. టిఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేసిన సిఎం రేవంత్‌ రెడ్డి తర్వాత ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి వరకు మద్యం సరఫరా చేస్తున్న బెల్ట్ షాపులను మూయించి వేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

తెలంగాణలో 2,620 వైన్ షాపులకు మాత్రమే ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. కానీ సుమారు లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. గ్రామస్థాయి వరకు వ్యాపించిన ఈ బెల్ట్ షాపుల వలన యువత, విద్యార్దులు మద్యానికి అలవాటుపడి జీవితాలు పాడు చేసుకొంటున్నారు. కనుక వీలైనంత త్వరగా బెల్ట్ షాపులు మూయించివేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అలాగే మాదక ద్రవ్యాల నిరోధక విభాగాన్ని కూడా మరింత పటిష్టం చేసుకొని రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.


Related Post