కుమ్మకు రాజకీయ ఆరోపణలతో ఏం ప్రయోజనం కిషన్‌ జీ?

December 09, 2023


img

ఎన్నికల సమయంలో ఒక పార్టీతో మరో పార్టీ కుమ్మక్కు అయ్యిందంటూ మూడు ప్రధాన పార్టీలు పరస్పరం ఆరోపించుకొన్నాయి. కానీ ప్రజలు ఆ మూడు పార్టీలకే ఓట్లు వేశారు. తెలంగాణను ఉద్దరిస్తామన్న బీఎస్పీకి వేయలేదు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు జనసేనకు ఓట్లు వేయలేదు. 

ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్‌ అప్పుడే తన మార్క్ పాలన ప్రారంభించింది. నేటి నుంచి నాలుగు రోజులు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కూడా. వాటికి బీజేపీ ఎమ్మెల్యేలను పంపించకుండా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌, మజ్లీస్‌ పార్టీలు కుమ్మకు అయ్యాయంటూ ఆరోపించడం చాలా హాస్యస్పదంగా ఉంది. 

అనేక మంది సీనియర్లు ఉండగా మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకరుగా నియమించడాని కిషన్ రెడ్డి తప్పు పట్టారు. కాంగ్రెస్‌, మజ్లీస్‌ల మద్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. 

అయితే ప్రోటెం స్పీకర్‌ పదవి ఎమ్మెల్యేల చేత, స్పీకర్‌గా ఎన్నుకోబడే గడ్డం ప్రసాదరావు చేత   ప్రమాణస్వీకారం చేయించేవరకే అని కిషన్ రెడ్డికి తెలియదనుకోలేము. కానీ ప్రోటెం స్పీకర్‌తోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభను నడిపించేయబోతోందన్నట్లున్నాయి కిషన్ రెడ్డి మాటలు. 

అయినా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఇళ్ళు, కార్యాలయాలపై కేంద్రం ఐ‌టి దాడులు చేయించి బిఆర్ఎస్ పార్టీకి ఎంతగా సాయపడిందో అందరూ చూశారు కదా?బిఆర్ఎస్ ఓటమికి బీజేపీతో కుమ్మక్కు అవ్వడం కూడా ఓ కారణమే అని అందరికీ తెలుసు. 

ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా ఈ కుమ్మక్కు రాజకీయాలతో కిషన్‌రెడ్డి ఏం సాధించగలరు? కాంగ్రెస్‌ ప్రభుత్వం సుస్థిరంగా సాగేందుకు రేపు రేవంత్‌ రెడ్డి నేరుగా ఓవైసీలతో మాట్లాడి మద్దతు తీసుకొంటే కిషన్ రెడ్డి, బీజేపీ అడ్డుకోగలరా? అభ్యంతరం చెప్పగలరా? 


Related Post