గురువారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రగతి భవన్ పేరును జ్యోతీరావు పోలింగ్ ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓ పక్క వారి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుండగానే ప్రజాభవన్ వద్ద గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్, బారికేడ్లు అన్నిటినీ జీహెచ్‌ఎంసీ సిబ్బంది కట్ చేసి తొలగించేశారు. ఇక నుంచి సామాన్య ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి, వినతిపత్రాలు ఇవ్వడానికి ప్రజాభవన్‌లోకి రావచ్చని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ప్రమాణస్వీకారం చేసిన రెండు గంటలు కూడా గడవక మునుపే రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ కలిసి సచివాలయానికి వెళ్ళారు. ఇదివరకు వారిని సచివాలయం గేట్లోకి కూడా రానిచ్చేవారు కాదు. ఇప్పుడు వారందరూ తమ తమ కాన్వాయ్‌లలో దర్జాగా లోనికి వచ్చారు. వారికి సచివాలయంలో అధికారులు, ఉద్యోగులు సాదరంగా స్వాగతం పలికి లోనికి తీసుకువెళ్ళారు.
అనంతరం సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆనవాయితీ ప్రకారం ముందుగా ముఖ్యమంత్రి, మంత్రులు తమ తమ ఛాంబర్లలో పూజా కార్యక్రమాలు చేయవలసి ఉండగా చేయకుండానే మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడం విశేషం.
తొలి సమావేశంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపైనే ప్రధానంగా చర్చించారు. వాటిని అమలుచేసేందుకు ప్రభుత్వంపై పడే అదనపు భారం, దానిని ఏవిదంగా సమీకరించుకోవాలి?అనే అంశాలపై చర్చించారు. వీటిపై సంబందిత అధికారులు తక్షణం అధ్యయనం చేసి నివేదికలు సమర్పించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన్నట్లు తెలుస్తోంది.
ఆరు గ్యారెంటీలను వీలైనంత త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా అమలులుచేయాలని భావిస్తున్నారు. అవసరమైతే ముందుగా ఎంపిక చేసిన జిల్లా లేదా నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టులా అమలు చేసి దానిలో లోటుపాట్లను, కష్టానష్టాలను తెలుసుకొనే ప్రయత్నం చేయవచ్చునాని భావిస్తున్నారు.
మొత్తం మీద రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని మించిన మెరుపు వేగంతో తొలిరోజు కార్యక్రమాలు నిర్వహించారని చెప్పవచ్చు. కానీ ఈ దూకుడు ఎంతకాలం ఉంటుందో చూడాలి.