బుధవారం రాత్రి 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి రవిగుప్తాలతో సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించేవారు. నిఘా పెట్టేవారు. కానీ ఇప్పుడు అదే పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు… అదే రేవంత్ రెడ్డి కోసం విమానాశ్రయం వద్ద ఎదురుచూపులు చూస్తూ, రాగానే ఎదురేగి ఘనస్వాగతం పలకవలసి వస్తోంది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డికే వారు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటివన్నీ సర్వసాధారణమే అని అనుకోవచ్చు కానీ కేసీఆర్ హయాంలో కొందరు అధికారులు కాస్త అతిగా, కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కేసీఆర్ ప్రాపకం కోసం ప్రతిపక్ష నేతల పట్ల కాస్త దురుసుగా వ్యవహరిస్తుండేవారు. చివరికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల కూడా పలువురు ఉన్నతాధికారులు అనుచితంగా ప్రవర్తించడం అందరికీ తెలుసు. అందువల్లే ఇప్పుడు వారిలో ఈ మార్పులు కాస్త విచిత్రంగా అనిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డికి అధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేసినప్పటికీ, ముఖ్యమంత్రిగా ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్ కారులోనే గచ్చిబౌలిలోని తాము బస చేసిన ఎల్లా హోటల్‌కి బయలుదేరారు. అయితే ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే కనుక కాన్వాయ్‌తో ఆయన కారుని అనుసరించారు.