కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో పార్టీలో సీనియర్లు మంత్రి పదవులు దక్కించుకొనేందుకు ఆరాటపడుతున్నారు. అయితే సీనియర్ల జాబితా చాలా పెద్దదే ఉంది కానీ మంత్రి పదవులు 17 మాత్రమే ఉన్నాయి. కనుక సీనియర్ల వడపోత కూడా తప్పదు.
కీలక శాఖలు ఆశిస్తున్నవారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.
మంత్రి పదవులు ఆశిస్తునవారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, జి.వివేక్, బాలూ నాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, షబ్బీర్ అలీ, అడ్డంకి దయాకర్, బలరాం నాయక్, విజయశాంతి, సీతక్క, కొండా సురేఖ తదితరులున్నారు.
వీటన్నితోపాటు కులాల ప్రతిపదికన, జిల్లాల ప్రాతిపదికన కూడా మంత్రులను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. కనుక కాంగ్రెస్ అధిష్టానానికి, రేవంత్ రెడ్డికి కూడా మంత్రివర్గం కూర్పు, ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలు పెద్ద తలనొప్పి వ్యవహారమనే చెప్పవచ్చు.
ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితో పాటు 6-9 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిగిలిన వారిని ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.