తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఎంతో ముచ్చటపడి వందల కోట్లు ఖర్చుచేసి వైట్‌హౌస్‌ని తలపించే విదంగా సచివాలయాన్ని నిర్మించుకొన్నారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం దానిలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా అడుగుపెట్టనీయలేదు. కానీ తాను నిర్మించిన సచివాలయంలో ఇప్పుడు తానే అడుగుపెట్టలేని స్థితిలో ఉన్నారు. ఇది బాధ కలిగిస్తుంది కానీ మన కర్మలను బట్టే ఫలితాలు కూడా ఉంటాయి కనుక ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు.
ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా అడుగుపెట్టనీయలేదు. కానీ నేడు కనీసం ఎమ్మెల్యే కూడా కానీ తెలంగాణ జనసమీతి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సచివాలయంలోకి అడుగుపెట్టగలిగారు. సచివాలయ ఉద్యోగులు ఆయనకు ప్రధాన ద్వారం వద్దనే ఘనస్వాగతం పలికి సాదరంగా లోనికి తీసుకువెళ్ళారు.
ముందుగా కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ అందరూ కలిసి టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. సచివాలయ ఉద్యోగులు సంతోషంతో ప్రొఫెసర్ కోదండరామ్‌ని తమ భుజాలపైకి ఎత్తుకొని మోసుకొంటూ లోనికి తీసుకువెళ్ళారు.
అనంతరం ఆయన వారితో మాట్లాడుతూ, “కేసీఆర్ మీ హక్కులను హరించివేసి, తీవ్ర ఒత్తిడి సృష్టించారని నాకు తెలుసు. కొత్త ప్రభుత్వం మీ హక్కులను గౌరవిస్తుంది. మీ సమస్యల పరిష్కారం కోసం నేను మీకు, ప్రభుత్వానికి మద్య వారధిగా పనిచేస్తాను. అందరూ హాయిగా ఎటువంటి ఒత్తిళ్ళు, భయాలు లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయండి,” అని అన్నారు.
సచివాలయ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుని స్వాగతిస్తూ టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకోవడం గమనిస్తే, ఇంతకాలం వారందరూ కూడా కేసీఆర్ వైఖరి పట్ల ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్దమవుతోంది.