కాంగ్రెస్ పార్టీ కేవలం 64 సీట్లు గెలుచుకొని తెలంగాణలో అధికారంలోకి వస్తోంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలలో ఎప్పుడు ఎవరికి కోపం వచ్చిన కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు బయటకు జారుకొంటే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది.
కనుక ఎంతో కష్టపడి పిసిసి అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పదవిని సాధించుకొన్న రేవంత్ రెడ్డి అలాంటి ప్రమాదం ముంచుకువచ్చే వరకు చేతులు ముడుచుకొని కూర్చోంటారనుకోలేము. మజ్లీస్ వద్ద ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు కనుక ముందుగా వీలైతే ఆ పార్టీతో దోస్తీకి ప్రయత్నించవచ్చు. పైగా హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు కూడా మజ్లీస్ సహాయ సహకారాలు రేవంత్ రెడ్డికి చాలా అవసరం. కనుక ఓవైసీలను ప్రసన్నం చేసుకొనేందుకు త్వరలోనే ప్రయత్నాలు ప్రారంభించడం ఖాయమే.
కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కీచులాడుకొంటూ తమ ప్రభుత్వాన్ని తామే కూలదోసుకొని చివరికి తన వద్దకే వస్తారని కేసీఆర్‌కి గట్టి నమ్మకం ఉంది. కానీ ఆయన కూడా అంత వరకు చేతులు ముడుచుకొని కూర్చోకపోవచ్చు.
ఎందుకంటే నేడు కాకపోయినా రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి తప్పకుండా తమపై ఓటుకి నోటు కేసుకి ప్రతీకారం తీర్చుకోకుండా విడిచిపెట్టరని కేసీఆర్‌కు తెలుసు. అందుకు కాళేశ్వరంలో అవినీతి కేసులను తవ్వి తీయిస్తారని కూడా తెలుసు.
మరోపక్క మోడీ ప్రభుత్వం కూడా తెలంగాణలో తమను రాజకీయంగా బలహీనపరిచేందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఐటి కేసులను తీరుగదోడే ప్రమాదం పొంచి ఉందని కేసీఆర్‌కు తెలుసు.కనుక ఈ కేసుల నుంచి రక్షణ కోసం కేసీఆర్ తప్పకుండా మోడీతో మళ్ళీ దోస్తీకి ప్రయత్నించవచ్చు.
మోడీ, అమిత్ షాలకు కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువు. దాని వలననే ఏనాటికైనా ప్రమాదం పొంచి ఉంది. కనుక వారు కూడా కేసీఆర్‌తో దోస్తీ చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పడగొట్టేందుకు కేసీఆర్‌కు సహకరించవచ్చు.
అప్పుడు కేసీఆర్ వద్ద 39 మంది సొంత ఎమ్మెల్యేలు, మజ్లీస్: 7, బీజేపీ: 8మంది ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం 54 మంది అవుతారు. అంతమందిని కేసీఆర్ కూడగట్ట గలిగితే రేవంత్ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో రగిలిపోయే మరో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన పంచన చేరకుండా ఉండరు.
కనుక తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్-బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ చదరంగం తప్పక మొదలవుతుందని భావించవచ్చు. మరి ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో?