కాంగ్రెస్‌ హామీతో టిఎస్‌ఆర్టీసీ టైర్లు పంక్చర్ తప్పదా?

December 06, 2023


img

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా టిఎస్‌ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆరు గ్యారెంటీ హామీల ఫైలుపై సంతకం చేస్తానని రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పుకొన్నారు. 

కనుక రాష్ట్రంలో ఈవిధానాన్ని అమలుచేసేందుకు టిఎస్‌ఆర్టీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా ఈ హామీని అమలుచేస్తోంది. కనుక అక్కడ ఏవిదంగా అమలుచేస్తోంది?దానిలో లోటుపాట్లు ఏమిటి?ఈ హామీతో టిఎస్‌ఆర్టీసీపై ఎంత భారం పడుతుంది? దానిని ఏవిధంగా పూడ్చుకోవాలి?వగైరా అంశాలపై అధ్యయనం చేసేందుకు నలుగురు టిఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు బెంగళూరుకి వెళ్ళారు. 

ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక తరహాలో ఎక్స్‌ప్రెస్‌, పల్లె వెలుగు, సిటీ బస్సులలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనుకొంటే టిఎస్‌ఆర్టీసీ మీద ఏడాదికి సుమారు రూ.2,200 కోట్లు ఆర్ధికభారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అదే... పల్లెవెలుగు, సిటీ బస్సులకే ఈ హామీని పరిమితం చేసిన్నట్లయితే సుమారు రూ.750 కోట్ల భారం పడుతుంది. 

ఇంత భారాన్ని టిఎస్‌ఆర్టీసీ భరించలేదు కనుక ఈ హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వమే టిఎస్‌ఆర్టీసీకి ఆమేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించవలసి ఉంటుంది. ఒకవేళ కేటాయించలేకపోతే ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న టిఎస్‌ఆర్టీసీ మళ్ళీ మునిగిపోతుంది. కనుక కాంగ్రెస్‌ హామీల మొదటి సమ్మెటపోటు టిఎస్‌ఆర్టీసీ మీదే పడబోతున్నట్లు స్పష్టమవుతోంది.


Related Post