కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినవారిలో భట్టి విక్రమార్క కూడా ఒకరు. అయితే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందున, భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇచ్చేందుకు లేదా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో కీలకశాఖను కూడా ఇవ్వాలని నిర్ణయించిన్నట్లు సమాచారం.
అప్పుడు పిసిసి అధ్యక్ష పదవిని సీనియర్ నేతలైన పొన్నం ప్రభాకర్, మధు యాష్కీగౌడ్, షబ్బీర్ అలీ, మల్లు రవిలలో ఎవరో ఒకరికి ఇవ్వాలని భావిస్తునట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎలాగూ గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు కనుక ఆ తర్వాత ఎవరెవరికి ఏఏ శాఖలు, మంత్రి పదవులు లభిస్తాయో తేలిపోతుంది.
ప్రభుత్వం ఏర్పాటుకి 60 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా కాంగ్రెస్ పార్టీకి అదనంగా మరో నలుగురు అంటే 64 మంది మాత్రమే ఉన్నారు. కనుక ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకొనేందుకు ప్రతీ ఒక్కరినీ సంతృప్తి పరచడం, ముఖ్యంగా పార్టీ తనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్లను సంతృప్తి పరచడం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము వంటిదే అని చెప్పక తప్పదు. మరి ఎలా నెగ్గుకు వస్తారో చూడాలి.