తెలంగాణ కాంగ్రెస్ నేతలలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. ఒకవేళ తనకు ఇవ్వకపోయినా వేరెవరికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పర్వాలేదు కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఇవ్వొద్దని గట్టిగా పట్టుబట్టారు కూడా. కానీ ఆయన కోరుకొన్నట్లు జరుగలేదు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా నిర్ణయించింది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కంగుతిని ఉంటారు. కానీ రేవంత్ రెడ్డిని ఇంకా వ్యతిరేకిస్తే తనే నష్టపోతానని గ్రహించే ఉంటారు. అందుకే ‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న సోదరుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు’ తెలిపారు.
అయితే ఆ తర్వాత చెప్పిన రెండు ముక్కలు నేటికీ ఆయన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని సూచిస్తున్నాయి. “ఇకపై కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయి. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి నిర్ణయాలే అమలవుతాయి. సీఎల్పీ సమావేశంలో కూడా ఇదే సిద్దాంతంతో ముఖ్యమంత్రిని ఎన్నుకొన్నారు,” అని అన్నారు.
అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటే సహించమని, సహకరించమని, తమ అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించిన్నట్లే భావించవచ్చు. కనుక రేవంత్ ప్రభుత్వానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గండం పొంచి ఉందనే భావించవచ్చు.