తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వచ్చి ప్రచారం చేశారు. ఈసారి ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తామని అందరూ బల్లగుద్ది వాదించారు.
కానీ అప్పటికే బీజేపీ ఓటమి ఖాయమని బహుశః వారందరూ గ్రహించే ఉంటారు. ఒకవేళ తెలియదనుకొంటే సర్వేలన్నీ చాలా స్పష్టంగానే బీజేపీ ఓటమి గురించి ముందే చెప్పాయి కనుక తెలియదనుకోలేము. తమ ఓటమికి కారణాలు ఏమిటో కూడా వారికి బాగా తెలుసు. కనుక ఇప్పుడు వాటి గురించి చర్చ అనవసరం.
కానీ ఈసారి 8 సీట్లు గెల్చుకోవడాన్నే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గొప్ప విజయంగా భావిస్తున్నట్లున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీకి ఈసారి 14 శాతం ఓటింగ్ పెరిగింది. గతంతో పోలిస్తే ఇది ఈసారి నూరు శాతం పెరిగింది.
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేశాయి. అయినప్పటికీ కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించలేకపోయింది. బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఈ ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో మా పార్టీ క్రమంగా బలపడుతోందని స్పష్టమవుతోంది.
కామారెడ్డిలో సిఎం కేసీఆర్‌ని, కాబోయే సిఎం అని భావిస్తున్న రేవంత్ రెడ్డిని మా సీనియర్ నేత, అభ్యర్ధి వెంకట రమణారెడ్డి ఓడించారు. అదే స్పూర్తితో కనుక త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించేందుకు గట్టిగా కృషి చేస్తాం,” అని అన్నారు.
అయితే తెలంగాణలో బీజేపీ పూర్తిగా పుంజుకొన్న తర్వాత ఎన్నికలకు ముందు ఎందుకు పడిపోయింది? బిఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావాలని పోరాడుతున్నప్పుడు, మళ్ళీ దానికి లూపాయికారిగా సహకరించడం వలన ఎవరు నష్టపోయారు?
ఈ రహస్య అవగాహనాలు, లోపాయికారి ఒప్పందాల వలన బీజేపీ విశ్వసనీయత కోల్పోతోందని బీజేపీలో ఎవరూ గ్రహించడం లేదా? అసలు తెలంగాణ బీజేపీని పణంగా పెట్టి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఏమిటి? చివరికి బీజేపీ ఏం సాధించగలిగింది? అని ఆత్మవిమర్శ చేసుకోవవలసి ఉండగా, తమ వైఫల్యాన్ని, ఓటమిని కిషన్ రెడ్డి సమర్ధించుకొంటూ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?