కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌తో సహా దేశంలో బీజేపీని వ్యతిరేకించేపార్టీలన్నీ ఏకమయ్యి ఆర్భాటంగా ‘ఇండియా’ పేరుతో కూటమి ఏర్పాటు చేసుకొన్నాయి. వాటి ఐక్యాతను, శక్తి సామర్ధ్యాలను నిరూపించుకోవడానికి నాలుగు రాష్ట్రాలలో జరిగిన తాజా ఎన్నికలు ఓ మంచి అవకాశం కల్పించాయి.
కానీ కూటమిలో మిత్రపక్షాలను కలుపుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్ళి మూడు రాష్ట్రాలలో బోర్లా పడింది. ఇంకా బాధాకరం ఏమిటంటే కాంగ్రెస్ చేతిలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలను కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేజార్చుకొంది. రెంటినీ బీజేపీకి అప్పగించేసింది.
కాంగ్రెస్ ఓటమిపై పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ కూటమిలో భాగస్వాములను పట్టించుకోకుండా ఒంటరిగా వెళ్ళి నష్టపోయింది. దీని వలన ఇండియా కూటమి కూడా తీరని అప్రదిష్ట కలిగింది,” అని అన్నారు.
మూడు రాష్ట్రాలు చేజారిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇండియా కూటమి గుర్తుకు వచ్చిన్నట్లుంది. బుధవారం ఢిల్లీలో కూటమి సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భాగస్వామ్య పార్టీల నేతలందరికీ ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు.
కానీ ఈ సమావేశం గురించి తనకు ముందస్తు సమాచారం లేనందున హాజరుకావడం లేదని మమతా బెనర్జీ చెప్పగా, కూటమిలో మరో ముఖ్య నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తాను రాలేనని చెప్పారు. దీంతో రేపు జరగాల్సిన ఇండియా కూటమి సమావేశం రద్దు అయ్యింది. దీంతో ఇండియా కూటమితో ఆర్భాటమే తప్ప ఒరిగేదేమీ లేదని స్పష్టం అవుతోంది.