పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమనుకొంటే, ఇప్పుడు కాంగ్రెస్ నేతలెవరూ గట్టిగా ఆ మాట చెప్పడం లేదు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలోనే సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించబోమని తెగేసి చెప్పిన్నట్లు తెలుస్తోంది.
చివరికి దీనిపై కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఏకవాఖ్య తీర్మానం చేయడంతో ముఖ్యమంత్రి పంచాయితీ ఢిల్లీకి మారింది. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు పిలుపు రావడంతో వారిద్దరూ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. దీంతో రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడిందా? అనే సందేహం కలుగుతోంది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈరోజు మధ్యాహ్నం వారిరువురితో చర్చించిన తర్వాత వారి అభిప్రాయాలు సోనియా గాంధీకి తెలియజేస్తారు. ఆమె ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు చేస్తారు.
ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వారితో కలిసి హైదరాబాద్ తిరిగివచ్చి ఆమె సూచించినవారి పేరును ప్రకటిస్తారు. ఈరోజు సాయంత్రంలోగా ఈ తతంగం అంతా పూర్తయితే బుధవారం లేదా గురువారంనాడు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.