ఈరోజు ఉదయం తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాడుకొంటారనుకొంటే, ప్రశాంతంగా సీఎల్పీ సమావేశం జరిగిపోవడం దానిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎటువంటి వాదోపవాదాలు చేయకుండా తమ సీఎల్పీ నాయకుడిని ఎన్నుకొంటున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కాంగ్రెస్ తీరు ఏమీ మారిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.
సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ తదితరులు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. రాత్రి 8.30 గంటలకు ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం అందింది.
కానీ కాంగ్రెస్ అధిష్టానం రేపు ఉదయం దీనిపై ప్రకటన చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా నియమించబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి పేరు ఇంతవరకు ప్రకటించలేదు.
ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటివారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వ్యతిరేకిస్తున్నందునే ముఖ్యమంత్రి పేరు ప్రకటించలేదా?లేక కాంగ్రెస్ అధిష్టానం వారిని బుజ్జగిస్తోందా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి రాజకీయాలు, హడావుడి మామూలే అని మరోసారి నిరూపించుకొన్నట్లయింది.