కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిలని విమర్శించే స్థాయి షర్మిలకి ఉందా?

December 02, 2023


img

వైఎస్ షర్మిల ఈరోజు మీడియా సమావేశానికి ఓ సూట్ కేసు తీసుకువచ్చి దీనిని కేసీఆర్‌కు గిఫ్ట్ గా ఇస్తున్నానని చెప్పారు. దానిపై ‘బైబై కేసీఆర్‌: తెలంగాణ ప్రజలు’ అని వ్రాయించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పేశారని, రేపు ఎన్నికల ఫలితాలు రాగానే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేయాలని ఆమె వ్యంగ్యంగా అన్నారు. 

అయితే ఆమె తన దారి తాను చూసుకొంటూ తన పార్టీ నేతలకు తెలియజేయకుండా తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దపడినప్పుడే, ఆమెను వారే పార్టీ నుంచి బహిష్కరించి, అందరూ ఆమెకు బైబై చెప్పేసి వెళ్ళి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు కదా? తమ పార్టీని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. 

కనుక ఇప్పుడు ఆమెకు సొంత పార్టీ కూడా లేదు. ఈ విషయం మరిచి ఆమె కేసీఆర్‌కు బైబై చెప్పడం విడ్డూరంగా ఉంది. కేసీఆర్‌ తెలంగాణ కోసం కోట్లాడారు. సాధించారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి చూపారు. కానీ వైఎస్ షర్మిల తెలంగాణకు ఏమి చేశారు? అని ప్రశ్నిస్తే ఇదని చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. అటువంటి మహిళ కేసీఆర్‌ని ఎద్దేవా చేస్తుండటం చాలా దారుణం. 

ఆమె కేసీఆర్‌ని మాత్రమే కాదు... ఆమె చేరాలనుకొంటున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడు, కుదిరితే కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కూడా ‘బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వ్యక్తని, ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని’ వైఎస్ షర్మిల విమర్శించారు. 

రేవంత్‌ రెడ్డి విషయానికి వస్తే, పూర్తిగా నిర్వీర్యమైన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించి అధికారంలోకి తీసుకురాబోతున్నారు. తద్వారా తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకొన్నారు. మరి వైఎస్ షర్మిల సొంత పార్టీ వారిచేతే బహిష్కరించబడ్డారు కదా?ఆ పార్టీని నడపలేక చేతులెత్తేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమయ్యారు కదా? కనుక ఆమెకు రేవంత్‌ రెడ్డిని విమర్శించే స్థాయి కూడా లేదనే చెప్పాలి.


Related Post