ఆదివారం తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు సూచిస్తున్నప్పటికీ, ఒకవేళ రెండు పార్టీలకు సరిసమానంగా సీట్లు వచ్చిన్నట్లయితే, కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేయకుండా ఉండరు. కనుక కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. కాంగ్రెస్ అభ్యర్ధులలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్ధులందరినీ తక్షణం హైదరాబాద్ రప్పించి, వారందరినీ బెంగళూరుకు తరలించాలని ఆదేశించిన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అయితేనే వారిని కేసీఆర్ ఉచ్చుకి చిక్కుకోకుండా కాపాడుకోగలమని కాంగ్రెస్ అధిష్టానం భావించడం సహజమే. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు వారి పూర్తి బాధ్యతలు అప్పగించిన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వెంటనే వారందరినీ రాష్ట్రానికి తీసుకురాకుండా, నేరుగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజునే హైదరాబాద్‌కు తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘం నుంచి ప్రమాణ పత్రాలు తీసుకోవలసి ఉంటుంది కనుక వారి తరపున వాటిని తీసుకొనేందుకు వీలుగా అఫిడవిట్‌లపై సంతకాలు చేసి తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధులను ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం బెంగళూరుకి తరలించవచ్చని సమాచారం.
మరోవైపు బిఆర్ఎస్ పార్టీ కూడా తన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది. ఆదివారం మధ్యాహ్నం కల్లా ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని రేవంత్ రెడ్డి ఇదివరకే చెప్పారు. అదే బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే సిఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి డిసెంబర్ 6 (అదృష్ట సంఖ్య, నవమి)న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.