ఆ బీసీ ముఖ్యమంత్రి ఎవరో మందకృష్ణ చెప్పేశారుగా

November 28, 2023


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సహా బీజేపీ పెద్దలందరూ పదేపదే చెపుతున్నారు. అయితే ఆ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో చెప్పడం లేదు. కానీ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీకి సన్నిహితంగా తిరుగుతున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆ బీసీ ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశారు. ఈరోజు ఉదయం కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ, బీజేపీ పెద్దలు చెపుతున్న బీసీ ముఖ్యమంత్రి ఆయనే అని చెప్పేశారు. 

బండి సంజయ్‌ సామాన్యుడు కాడాని, కేసీఆర్‌ అంతటివాడిని ఎదుర్కొని పోరాడి బీజేపీని గెలిపించబోతున్న మహా యోధుడు అని, ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ అండగా ఉంటారని మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్స్, ప్రశ్నాపత్రాల లీకేజిలతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకొందని కనుక బిఆర్ఎస్ పార్టీని గద్దె దించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఎన్నికల హామీలను అమలుచేయలేక కర్ణాటకలో ఇప్పటికే చేతులెత్తేసిందని, కనుక దాని హామీలు నమ్మి మోసపోవద్దని, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటైతే తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కనుక బీజేపీని గెలిపించాలని మందకృష్ణ మాదిగ ప్రజలను కోరారు. 

బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించగానే బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ఇద్దరిలో ఎవరనే చర్చ మొదలైంది. బండి సంజయ్‌ అని మందకృష్ణ మాదిగ అని తేల్చి చెప్పేశారు. కానీ ప్రజలు కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలలో ఏదో ఓ పార్టీని ఎన్నుకోబోతున్నారని సర్వేలు చెపుతున్నాయి. కనుక ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఎవరనేది బయటపెట్టినా బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.


Related Post