గోషామహల్ ఎవరిదో?

November 28, 2023


img

గత ఎన్నికలలో బీజేపీ 119 స్థానాలకు పోటీ చేస్తే గోషామహల్ నుంచి రాజా సింగ్ ఒక్కరే గెలిచారు. అందుకు ఆయనకు బీజేపీ చాలా ప్రాధాన్యత ఇస్తుందనుకొంటే, ముస్లింలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఆయన బీజేపీపై అలగలేదు. ఉంటే బీజేపీలోనే ఉంటాను లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకొని గోసేవలో తరిస్తానని స్పష్టంగా చెప్పారు. ఆ విధేయతే ఆయనకు బీజేపీ మళ్ళీ టికెట్‌ ఇచ్చేలా చేసింది. 

కనుక రాజా సింగ్ మరోసారి గెలిచి తన సత్తా చూపించుకోవాలనుకొంటున్నారు. ఆయనకు మద్దతుగా యూపీ సిఎం యోగీ ఆదిత్యనాధ్ తదితరులు వచ్చి ప్రచారం చేయడంతో గోషామహల్ నియోజకవర్గంలో ఆయన దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ఉత్తరాది రాష్ట్రాల ఓటర్లందరూ ఆయనకే మద్దతు ఇస్తుండటం చాలా కలిసి వచ్చే అంశమే. 

అయితే ఈసారి గోషామహల్ సీటు కూడా బీజేపీని గెలవనీయకుండా అడ్డుకొంటామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శపధం చేశారు. అందుకే గోషామహల్‌ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్దపెట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కూడా. 

పాతబస్తీ పరిధిలో ఉన్న గోషామహల్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా నందకిశోర్ వ్యాస్ పోటీ చేస్తున్నారు. బిఆర్ఎస్, మజ్లీస్‌ మద్య బలమైన దోస్తీ ఉంది కనుక ఆయనకు మజ్లీస్‌ మద్దతు ఇస్తోంది. రాజా సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత అక్కడి నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయాలనుకొన్నారు. కానీ రాజా సింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ ఆయనకే టికెట్‌ ఇవ్వడంతో, ఆయన అలిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ రెండూ బిఆర్ఎస్‌ అభ్యర్ధికి కలిసిరావచ్చు. 

గోషామహల్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మొగిలి సునీతారావు పోటీ చేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తూండటం ఆమెకు కలిసి రావచ్చు. కానీ ఆ ఒక్క కారణంతో ఆమె బీజేపీ, బిఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించలేరు. ఈసారి గోషామహల్‌లో బీజేపీ, బిఆర్ఎస్‌ల మద్యనే ప్రధానంగా పోటీ సాగుతోంది. మరి ఎసారి ఘోషా మహల్ ఎవరికి దక్కుతుందో?


Related Post