రైతుబంధుతో మూడు పార్టీల మూడు ముక్కలాట

November 27, 2023


img

ఎన్నికలకు ముందు రైతుబంధుని నిలిపివేసి, మళ్ళీ నిధుల విడుదలకు అంగీకరించిన ఈసీ, చివరి క్షణంలో నిలిపివేసింది. దీంతో బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మూడు ముక్కలాట మొదలెట్టాయి. మంత్రి హరీష్ రావు నోరు జారినందునే రైతుబంధుని నిలిపివేస్తున్నట్లు ఈసీ స్పష్టంగా లేఖలో పేర్కొంది. 

కానీ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు కారణంగానే నిలిచిపోయిందని, కనుక రైతులను మోసగించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. 

దీనిపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, రైతుబంధు పేరు చెప్పుకొని మామఅల్లుళ్ళకు ఓట్లు దండుకోవాలనే యావే తప్ప నిజంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యం లేదని, బిఆర్ఎస్ పార్టీ ఎంత నీచానికి దిగజారిందంటే రైతుబంధు నిలిపివేయాలని నేను ఈసీకి లేఖ వ్రాసినట్లు ఓ నకిలీ లేఖ సృష్టించింది. కానీ రైతుబంధు నిలిచిపోయిందని రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదు. మరో 15 రోజులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది.కౌలు రైతులతో సహా అందరికీ రైతుబంధు చెల్లిస్తాము,” అని అన్నారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందిస్తూ, “రైతుబంధుపై కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. అవి నిలిపివేయించి కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాయి,” అని అన్నారు.

అయితే ఈసీ రైతుబంధుని శాస్వితంగా ఏమీ నిలిపివేయలేదు. దానికి ఆ అధికారం లేదు కూడా. కేవలం ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు అంటే డిసెంబర్‌ 5వరకు మాత్రమే నిలిపివేయగలదు. ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే అదే రైతుబంధుని అమలుచేయాల్సి ఉంటుంది. చేస్తామని చెప్పుకొంటున్నాయి కూడా. కానీ మూడు పార్టీలు రైతుబంధుని ఎదుట పార్టీ శాస్వితంగా నిలిపివేయించిందన్నట్లు మాట్లాడుతూ, ప్రత్యర్ధులని ప్రజల ముందు ధోషిగా నిలబెట్టి ఎన్నికలలో గెలవాలని తహతహలాడుతున్నాయి. ఈవిషయం ప్రజలకు తెలియదని అవి అనుకోవడం లేదు. కానీ రైతులకు ఎదుట పార్టీ ద్రోహం చేయడానికి వెనకాడదు అని నిరూపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి అంతే!


Related Post