తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్‌లో ఒకరైన మంత్రి హరీష్ రావు రైతుబంధు నిధుల గురించి చెప్పిన ముచ్చటతో నిధులు విడుదల నిలిచిపోయింది. ఈవిషయం కేంద్ర ఎన్నికల కమీషన్ స్వయంగా తెలియజేసింది.
తెలంగాణ ఎన్నికల సంఘానికి వ్రాసిన లేఖలో, “తెలంగాణలో ఎన్నికల కోడ్ నిబందనలకు లోబడి రైతుబంధు నిధుల విడుదలకు అనుమతించాము. కానీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఎన్నికలకు ముందు రైతుబంధు నిధులు విడుదల చేయబోతున్నామని ప్రజలకు చెప్పారు. ఈ విషయం అన్ని ప్రధాన పత్రికలు, టీవీ ఛానల్స్‌లో ప్రముఖంగా వచ్చింది.
ఎన్నికలకు ముందు ఈవిదంగా చెప్పడం ఎన్నికల కోడ్‌ని ఉల్లంగించడంగానే భావిస్తున్నాము. కనుక రైతుబంధు నిధుల విడుదలకు జారీ చేసిన అనుమతిని తక్షణమే ఉపసంహరించుకొంటున్నాము. ఇదే విషయాన్ని సోమవారం మధ్యాహ్నం 3గంటలలోగా తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ఆదేశిస్తున్నాము,” అని కేంద్ర ఎన్నికల కమీషన్ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు చాలా కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆయన నోరు జారి ‘రైతుబంధు నిధులు మీ ఖాతాలలో పడ్డాయని తెలియజేస్తూ రేపటి నుంచి మీ మొబైల్ ఫోన్లలో టింగ్ టింగ్‌మని మెసేజులు వస్తాయని’ చెప్పడమే కొంప ముంచింది.
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా, ఒకవేళ పోలింగ్‌లోగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో జమా అయ్యుంటే అది బిఆర్ఎస్ పార్టీకి ఓట్లను రాల్చి ఉండేది. కానీ మంత్రి హరీష్ రావు నోరు జారడంతో ఆ నిధులు విడుదల ఆగిపోయింది. కనుక దీనిపై కేసీఆర్ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.