సిఎం కేసీఆర్ ఆదివారం జగిత్యాలలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ సాధించాననే తృప్తి, దాంతో ఎంతో గౌరవం లభిస్తోంది. మీరందరూ నన్ను మన్నించి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. మీ ఆశీర్వాదంతో పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా చేశాను. నా జీవితానికి ఇంకేమి కావాలి? నాకిప్పుడు 70 ఏళ్ళు. ఈ వయసులో నేను మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసమో, అధికారం కోసమో తాపత్రయపడటం లేదు.
ఈ పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసుకొన్నాము. ఇంకా రాష్ట్రం మరింత అభివృద్ధి కావలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతీ అంగుళం భూమికి సాగునీరు అందించాలి. రైతులు మూడు పంటలు పండించుకొని ధనవంతులు కావాలి. కేరళ రాష్ట్రంలోలాగే తెలంగాణలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలి.
ఇలాంటి లక్ష్యాల కోసమే నేను ఎన్నికలలో పోటీ చేస్తున్నాను తప్ప పదవులు, అధికారం మీద లాలాసతో కాదు. కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొందామా? ఇది చాలనుకొని కాంగ్రెస్ చేతిలో పెట్టి మళ్ళీ సమస్యలు కోరి తెచ్చుకొందామా? మీరే ఆలోచించండి. నా పరిపాలన బాగుందనుకొంటే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపించండి,” అని అన్నారు.