ఈ నెల 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి. ఈసారి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్య గట్టి పోటీ నెలకొని ఉండటంతో తెలంగాణ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారా అని ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా సౌత్ ఫస్ట్ అనే సర్వే సంస్థ రాష్ట్రంలో సర్వే చేసి ప్రజలు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. దాని నివేదిక ప్రకారం కాంగ్రెస్‌కు 57-62 సీట్లు, బిఆర్ఎస్‌కు 41-46, మజ్లీస్‌కు 6-7, బీజేపీకి 3-6, ఇతరులకు 1-2 సీట్లు రావచ్చని పేర్కొంది.
ఓటింగ్ శాతం: కాంగ్రెస్: 42.5%, బిఆర్ఎస్: 37.6%, మజ్లీస్: 0.9%, బీజేపీ: 13.2%, ఇతరులకు: 5.8% రావచ్చని పేర్కొంది.
అయితే సర్వే సంస్థలు ప్రకటిస్తున్న నివేదికలకు ప్రామాణికత ఎంత? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో సర్వే సంస్థ నివేదిక ఒక్కోలా ఉంటున్నాయి. ఉదాహరణకు శ్రీ ఆత్మసాక్షి, జీ న్యూస్, ఇండియా టీవీ, రాజ్‌నీతి సంస్థలు బిఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పగా, సౌత్ ఫస్ట్ మాత్రం కాంగ్రెస్ గెలువబోతోందని చెపుతోంది.
లోక్‌పోల్ సర్వే మాత్రం సుమారు 20 రోజుల క్రితం చేసిన సర్వేలో బిఆర్ఎస్ పార్టీకి 36-39 రావచ్చని చెప్పింది. కానీ మళ్ళీ వారం రోజుల క్రితం చేసిన సర్వేలో బిఆర్ఎస్ పార్టీ పుంజుకొందని కనుక 45-51 సీట్లు గెలుచుకోవచ్చని తెలిపింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మొదట 69-72 సీట్లు రావచ్చని చెప్పింది. కానీ రెండో సర్వేలో 61-67 రావచ్చని చెప్పింది. అంటే లోక్‌పోల్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెపుతున్నప్పటికీ బిఆర్ఎస్ పార్టీ క్రమంగా పుంజుకొంటోందని చెపుతోంది.
అయితే అన్ని సర్వేలలో మజ్లీస్ మూడో స్థానంలో బీజేపీ నాలుగో స్థానానికే పరిమితం అవుతుందని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.