కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్ళందరూ తర్వాత బిఆర్ఎస్‌లోకి ఫిరాయిస్తారనే ప్రచారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారిందనే చెప్పాలి. గత రెండు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో ఇదే జరిగింది కనుక ఈసారి కూడా అలా జరగదని గ్యారెంటీ లేదు.
కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి చేపడుదామని తహతహలాడుతున్న సీనియర్ నేత, నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా దీనిని ధృవీకరించారు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 59 సీట్లకు ఒక్కటి తగ్గినా గెలిచిన ఎమ్మెల్యేలు పొలోమని బిఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం ఖాయమని ఎన్నికలకు ముందే చెప్పేశారు. కాంగ్రెస్ నేతలే చెప్పుకొంటున్నప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారా?
శనివారం మక్తల్ ఎన్నికల సభలో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ప్రయోజనం లేదు. ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ కొనుగోలు చేస్తారు. కనుక కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించడం అంటే కేసీఆర్‌ని మళ్ళీ గెలిపించడమే. కేసీఆర్‌ని గద్దె దించాలనుకొంటే బీజేపీకే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి రాష్ట్రంలో దళితులను మోసం చేశారు. కానీ బీజేపీని గెలిపిస్తే బీసీ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం, కుటుంబ అవినీతిపై విచారణ జరిపించి, అవినీతికి పాల్పడినవారీనందరినీ జైలుకి పంపిస్తాము,” అని అమిత్ షా అన్నారు.