పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేవారిలో, ఆయన నాయకత్వాన్ని అంగీకరించని నాయకులలో మొట్ట మొదటివ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే ‘రేవంత్ రెడ్డి కాదు... నేనే ముఖ్యమంత్రి అవుతానని’ కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.
కనుక ఇన్ని రోజులుగా రాష్ట్రంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతున్నా వారిద్దరూ ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు చాలా అరుదు. కనుక తనతో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తారని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. కానీ శుక్రవారం ఆ అద్భుతం జరిగింది.
రేవంత్ రెడ్డి శుక్రవారం నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి నకిరేకల్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడమే కాకుండా, ఆయనను తప్పకుండా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అడ్డా అని నిరూపించేందుకు ఈసారి జిల్లాలోని 12 సీట్లు కాంగ్రెస్‌కే ఇచ్చి గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒకే వేదికపై చేతులు కలిపి నిలబడటం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరడం రెండూ అరుదైన దృశ్యలే కదా?
కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు కూడా గెలవాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ గెలవాలని రేవంత్ రెడ్డి కోరుకొంటున్నారు. పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తికి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే కదా?