తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. కనుక 28వ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగించాల్సి ఉంటుంది. మిగిలిన ఈ నాలుగు రోజులలో మూడు పార్టీలు చాలా ఉదృతంగా ప్రచారం చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. కేసీఆర్ కూడా ఊహించని విదంగా కొత్తకొత్త వ్యూహాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. వాటిలో అతి ముఖ్యమైనది ప్రజలు మార్పు కోరుకొంటున్నారనే నినాదం కూడా ఒకటి.
అయితే తెలంగాణ ప్రజలు నిజంగా మార్పు కోరుకొంటున్నారా లేక కాంగ్రెస్ పార్టీయే మార్పు కోరుకొంటోందా? అంటే కాంగ్రెస్ పార్టీయే అని అర్దమవుతుంది. కానీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారని కాంగ్రెస్ జోరుగా మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొంటోంది.
తద్వారా ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించబోతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ చాలా ఉదృతంగా ఈ ప్రచారం చేస్తుండటంతో ఇంకా ఏ పార్టీకి ఓట్లు వేయాలని ఊగిసలాడేవారు ‘ఎలాగూ కాంగ్రెస్ గెలుస్తోంది కదా దానికే ఓట్లు వేసేద్దామనుకోవచ్చు. ప్రజలలో ఇటువంటి ఆలోచన కలిగించడానికే కాంగ్రెస్ ‘ప్రజలు మార్పు కోరుకొంటున్నారనే’ ఈ వ్యూహాన్ని అమలుచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే తెలంగాణ ప్రజలు నిజంగా మార్పు కోరుకొంటున్నారా? కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా లేదా?అనే ప్రశ్నలకు డిసెంబర్ 3న సమాధానం లభిస్తుంది.