కాంగ్రెస్ హామీ టిఎస్ఆర్టీసీని ముంచేయబోతోందా?

November 22, 2023


img

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అయితే ఈ ఒక్క హామీతో టిఎస్‌ఆర్టీసీ మళ్ళీ దివాళా తీసే ప్రమాదం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా టిఎస్‌ఆర్టీసీ నష్టాలలోనే కొనసాగింది. 

వీసీ సజ్జనార్‌ని టిఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించిన తర్వాత నుంచి టిఎస్‌ఆర్టీసీ మెల్లగాగాడిలో పడుతోంది. ఆయన టిఎస్‌ఆర్టీసీ కార్మికులను కలుపుకుపోతూ చేస్తున్న అనేక ప్రయత్నాలు ఫలిస్తుండటంతో ఎట్టకేలకు టిఎస్‌ఆర్టీసీ మెల్లగా నష్టాల ఊబిలో నుంచి బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే లాభాలను కళ్ళ జూస్తోంది. పాత డొక్కు బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయగలుగుతోంది. 

ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆ మేరకు టిఎస్‌ఆర్టీసీ ఆదాయం కోల్పోతుంది. బస్సులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంటే మహిళలు అందరూ బస్సులలోనే ప్రయాణిస్తారు. 

మరోపక్క డీజిల్, టైర్లు, బస్సుల విడిభాగాల ధరలు, నిర్వహణ వ్యయాలు మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంటాయి. కనుక ఈ హామీతో టిఎస్‌ఆర్టీసీకి ఓ వైపు ఆదాయం తగ్గుతుంటే, మరోవైపు ఆర్ధికభారం పెరుగుతుంటుంది. ఇది చివరికి నష్టాలకు దారి తీస్తుందని వేరే చెప్పక్కరలేదు. 

టిఎస్‌ఆర్టీసీని నష్టపోకుండా కాపాడుకొంటామని ఒకవేళ కాంగ్రెస్‌ హామీ ఇచ్చినా అది నిలుపుకొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే, ఈ ఎన్నికలలో గెలిచేందుకు అది వేలకోట్ల భారం పడే అనేక హామీలను ఇస్తోంది. వాటికే నిధులు సమకూర్చుకోలేని పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, టిఎస్‌ఆర్టీసీని కాపాడేందుకు నిధులు ఏవిదంగా కేటాయించగలదు?కనుక మహిళలకు ఉచిత హామీతో కాంగ్రెస్‌ గెలిస్తే గెలవచ్చునేమో కానీ టిఎస్‌ఆర్టీసీ మాత్రం పూర్తిగా మునగడం ఖాయమే.


Related Post