నిర్మలమ్మా... కేంద్రమంత్రివి ఇన్ని అబద్దాలా?

November 22, 2023


img

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి, కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. వాటికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు గణాంకాలతో సహా ఘాటుగా బదులిచ్చారు. 

మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ, “నిర్మలమ్మా... కేంద్ర ఆర్ధికమంత్రివి మీరే ఇన్ని అబద్దాలు చెప్పడం వాటితో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించడం తగునా?జాతీయ స్థాయిలో సగటు ఆదాయం కంటే తెలంగాణ ప్రజల సగటు ఆదాయం సుమారు లక్షన్నర ఎక్కువగా ఉందని మీ నీతిఆయోగ్ చెప్పింది కదా?

కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దేశానికి రూ.50 వేల కోట్లు అప్పులు ఉండేవి. కానీ ఈ పదేళ్ళలో వాటిని మీ ప్రభుత్వం లక్షన్నర కోట్లకు పెంచిన మాట వాస్తవమా కాదా?ఈ లెక్కన మీ వంద నెలల పాలనలో నెలకు లక్ష కోట్లు చొప్పున వంద లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు కదా?దేశంలో 22 రాష్ట్రాల కంటే తెలంగాణ తక్కువ అప్పు తీసుకొందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా?

మీ మోడీగారు పేదలకు, రైతులకు వడ్డీలతో అప్పులు ఇస్తారు. అంబానీ, ఆదానీ వంటి బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన అప్పులు మాఫీ చేస్తుంటారు. కానీ మా సిఎం కేసీఆర్‌ రైతుల కోసం ప్రాజెక్టులు, విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మించారు. రైతులకు రైతు భరోసా ఇస్తూ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మేము రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్లు పెట్టనందుకే మాకు రుణాలు ఇవ్వడం లేదని నిన్ననే మీరు (నిర్మలా సీతారామన్) చెప్పారు కదా?

సామాన్య ప్రజలు వినియోగించే పాలు, మజ్జిగ, బియ్యం, ఉప్పు, పప్పులు, నూనెలు ఇలా ప్రతీ వస్తువుపై జీఎస్టీ విధించి ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తోంది కదా మీ ప్రభుత్వం?మరే లెక్కన మా బిఆర్ఎస్‌ ప్రభుత్వం, పాలన కంటే మీ మోడీ ప్రభుత్వం, పాలన గొప్పదని చెప్పుకొంటున్నారు?

దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నది చాలక అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భ్రష్టు పట్టించేయాలని ఎందుకు కోరుకొంటున్నారు మీరు?” అంటూ మంత్రి హరీష్ రావు ఘాటుగా బదులిచ్చారు.


Related Post