తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ తరపు ప్రచారం కొరకు ఢిల్లీ నుంచి అతిరధ మహారధులు దిగుతున్నారు. ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మిగులు బడ్జెట్‌తో చేతికి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు.
కేసీఆర్ ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వలననే ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులు తెస్తున్న సొమ్మంతా అభివృద్ధి పనుల కోసమే ఉపయోగిస్తున్నామని కేసీఆర్ చెప్పుకొంటున్నారు. కానీ వేలకోట్లు అప్పులు తెచ్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కుంగిపోతుండటాన్ని ఏమనుకోవాలి?
కేసీఆర్ దళితబంధు గురించి గొప్పగా చెప్పుకొంటారు. కానీ తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఏం చేశారు. రాజయ్యని ఉప ముఖ్యమంత్రిగా నియమించి ఆరు నెలల్లోనే పదవిలో నుంచి పీకేశారు కదా?
అక్షరాస్యత విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం వెనకబడి ఉంది. దేశవ్యాప్తంగా 72 శాతం ఉంటే తెలంగాణలో 66శాతం ఉంది. తెలంగాణలోని 11 యూనివర్శిటీలలో సుమారు 2,000 పోస్టులు ఖాళీగా పడున్నాయి. విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొంటున్నారు కదా? మరి యూనివర్శిటీలలో పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు?
బీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.3,300 కోట్లు కేటాయిస్తే దానిలో రూ.77 కోట్లు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. మిగిలిన డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయింది?నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడింది. కానీ ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుకొంటోంది,” అని నిర్మలా సీతారామన్ విమర్శించారు.