గత ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. అందుకు పువ్వాడ అజయ్ కుమార్‌కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు.
కనుక ఈసారి ఖమ్మంలో 5 స్థానాలను గెలుచుకోవాలని కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, కాంగ్రెస్‌తో పొత్తులు కుదరక వామపక్షాలు 5స్థానాలకు పోటీ చేస్తుండటంతో మళ్ళీ ఖమ్మంలో రాజకీయ బలాబలాలు మారిపోయాయి.
ఈసారి ఖమ్మంలో బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ మీద కాంగ్రెస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇంకా యర్ర శ్రీకాంత్ (సీపీఎం), మిర్యాల రామకృష్ణ (బీజేపీ-జనసేన కూటమి) పోటీ చేస్తున్నారు. కనుక గత ఎన్నికల కంటే ఈసారి ఖమ్మంలో పువ్వాడకు గట్టి పోటీ ఉంటుంది కనుక ఎదురీత తప్పదు.
పాలేరులో కూడా ఈసారి బిఆర్ఎస్‌కు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. పాలేరు నుంచే తమ్మినేని వీరభద్రం (సీపీఎం), నున్నా రవి కుమార్ (బీజేపీ) పోటీ చేస్తున్నారు. కనుక ఇక్కడ కూడా కాంగ్రెస్, సీపీఎంల నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధి కందాళ ఉపేందర్‌కు గట్టి పోటీ ఉంది.
సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య (బిఆర్ఎస్)కు విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మట్టా రాగమయి (కాంగ్రెస్), నంబూరి రామలింగేశ్వర రావు (బీజేపీ), మాచర్ల భారతి ((సీపీఎం) పోటీ చేస్తున్నారు.
వైరాలో బానోత్ మదన్ లాల్ (బిఆర్ఎస్)కు, సీనియర్ కాంగ్రెస్ నేత మాలోతు రాందాస్, సీపీఎం సీనియర్ నేత భూక్యా వీరభద్రంల నుంచి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి ఇక్కడ జనసేన కూడా తమ అభ్యర్ధి సంపత్ కుమార్‌ని బరిలో దింపింది. కనుక ఓట్లు చీలితే కాంగ్రెస్, సిపిఎం పార్టీలు నష్టపోయే అవకాశం ఉంది.
మధిరలో సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పోటీ చేస్తున్నందున లింగాల కమల్ రాజు (బిఆర్ఎస్), పి. విజయరాజు (బీజేపీ)లకు గట్టి పోటీయే ఉంటుంది. కనుక ఈసారి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకొన్నా గొప్ప విషయమే అని భావించవచ్చు.