కాంగ్రెస్ అభయహస్తం మ్యానిఫెస్టోలో తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నిర్ధిష్టమైన జాబ్ క్యాలండర్ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే టిఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. ఇంకా ఉద్యోగాలు, నిరుద్యోగులు, ప్రవేశపరీక్షలకు సంబందించి పలు హామీలు ఇచ్చింది. ఇవన్నీ తెలంగాణలో నిరుద్యోగ యువతను ఆకట్టుకొంటాయని వేరే చెప్పక్కరలేదు.
కనుక మంత్రి కేటీఆర్ కూడా నిన్న హైదరాబాద్, టీ హబ్, అశోక్ నగర్ హాస్టల్స్‌లో యువతతో భేటీ అయ్యి వారికి కాంగ్రెస్ అభయహస్తంలో ఇచ్చిన హామీలనే ఇచ్చారు. అయితే ఉద్యోగాల భర్తీ గురించి ప్రతిపక్షాలు చెపుతున్నప్పుడే, అలాగే టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయినప్పుడే బిఆర్ఎస్ ప్రభుత్వం సత్వరం స్పందించి ఉంటే నేడు కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా?
కేటీఆర్ ఇచ్చిన హామీలు:
1. మళ్ళీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ప్రకటిస్తాం.
2. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో లోపాలను, అవరోధాలను గుర్తించి వేగవంతం చేస్తాం.
3. జాబ్ నోటిఫికేషన్లపై న్యాయపరమైన సమస్యలను, కేసులను వీలైనంత వేగంగా పరిష్కరిస్తాం.
4. టిఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం.