కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోందని కేసీఆర్‌ ఒప్పుకొంటున్నట్లేనా?

November 20, 2023


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ తన ఎన్నికల సభలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రం పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాలలో వందలమందిని పొట్టన పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఎప్పుడూ మోసాగిస్తూనే ఉందని అవకాశం ఇస్తే మళ్ళీ మరోసారి మోసగించేందుకు సిద్దంగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారం కట్టబెడితే రాబోయే 5 ఏళ్ళు ప్రజలందరూ బాధలు పడాల్సి ఉంటుందని సిఎం కేసీఆర్‌ ప్రజలను హెచ్చరిస్తున్నారు. కనుక తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడిన బిఆర్ఎస్ పార్టీనే ఈసారి కూడా గెలిపించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పదేళ్ళ పాలనకు, పదేళ్ళ కాంగ్రెస్‌ పాలనతో పోల్చి చూసుకోవాలని కేసీఆర్‌ హితవు పలుకుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని ఇప్పుడే చెపుతోంది గనుక ప్రజలు అటువంటి పార్టీతో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. 

కేసీఆర్‌ తన ప్రసంగాలలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తుండటం గమనిస్తే ఆయన కూడా ఈసారి కాంగ్రెస్‌ బలం పుంజుకొని బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోందని అంగీకరిస్తున్నట్లే భావించవచ్చు. ఎప్పటిలాగే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ ప్రజలను బిఆర్ఎస్ పార్టీ చేజారిపోకుండా కాపాడుకొనేందుకు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నేటికీ ఎన్నికల ప్రచార సభలలో కేసీఆర్‌ కొత్తకొత్త హామీలు ఇస్తూనే ఉండటం గమనిస్తే ఈసారి ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారాయని ఒప్పుకొంటున్నట్లే భావించవచ్చు. 


Related Post