తెలంగాణలో రైతులకు తమ ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తుంటే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలన్నారని బిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయానికి రోజుకి 4 గంటలు కూడా కరెంట్ ఈయలేకపోతుండటం, విద్యుత్ కొరత కారణంగా విద్యుత్ కోతలు మొదలవడంతో ఆ సమస్యలను కూడా బిఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. కనుక కాంగ్రెస్ దీనికి విరుగుడు కనిపెట్టింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామనే హామీని చేర్చి అదే గట్టిగా చెప్పుకొంటున్నారు. మరోపక్క కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి నిజంగా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపించేందుకు కాంగ్రెస్ నేతలు విద్యుత్ సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా రికార్డు (లాగ్ బుక్స్)లను తీయించి మీడియాకు, ప్రజలకు చూపిస్తున్నారు. దమ్ముంటే విద్యుత్ సబ్ స్టేషన్ల వద్దే చర్చిద్దాం రమ్మనమని బిఆర్ఎస్ నేతలకు సవాలు విసురుతున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, కరెంట్ ఉండదని రాష్ట్రం అంధకారమైపోతుందని ప్రజలను భయపెడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే విద్యుత్ కొనుగోలుచేస్తున్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఇస్తున్నామని కేసీఆర్ అబద్దాలు చెపుతున్నారు. రోజుకి 6-7 గంటలు మించి కరెంట్ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఏ రైతుని అడిగినా ఈ విషయం చెప్తాడు,” అని అన్నారు.
రెండు పార్టీలు విద్యుత్ అంశంతో పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నాయి కనుక రెంటిలో ప్రజలు దేనికి కరెంట్ షాక్ ఇస్తారో డిసెంబర్ 3న తెలుస్తుంది.