భద్రాచలంలో కేటీఆర్‌ ప్రచారం... బిఆర్ఎస్‌ని గెలిపిస్తుందా?

November 20, 2023


img

మరో 9 రోజులలో అంటే నవంబర్‌ 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక మూడు ప్రధాన పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌ ఆదివారం భద్రాచలం, ఇల్లెందులో రోడ్ షో నిర్వహించి బిఆర్ఎస్‌ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు తరపున ప్రచారం చేశారు. 

గత రెండు ఎన్నికలలో భద్రాచలం ప్రజలు ఏ కారణంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపించనప్పటికీ తమ ప్రభుత్వం నియోజకవర్గం అభివృద్ధిని విస్మరించలేదని కేటీఆర్‌ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని విదాలుగా అభివృద్ధి చేస్తూనే ఉన్నామని, అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ఇవి ఇలాగే కొనసాగాలంటే ఈసారి తెల్లం వెంకట్రావుకి ఓట్లు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

బిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి భద్రాచలం ఆలయాన్ని యాదాద్రి కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని, భద్రాచలంలో వరద ముంపు నివారణకు శాశ్విత పరిష్కారం చేస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

గత రెండు ఎన్నికలలో గెలిచి బిఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కానీ ఈసారి కాంగ్రెస్‌ గాలి బలంగా వీస్తోంది. కనుక ఎదురీత తప్పడం లేదు. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో ఈసారి రాజకీయ బలాబలాలు, సమీకరణాలు మారాయి. ఈ రెండు జిల్లాలలో మంచి పట్టున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ బిఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరి పాలేరు, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. కనుక ఈ రెండు జిల్లాలలో వీరిద్దరి ప్రభావం వలన ఈసారి బిఆర్ఎస్‌కు నష్టం కలిగే సూచనలున్నాయి. 

ఈ రెండు జిల్లాలలో వామపక్షాలకు కూడా గట్టి పట్టుంది. ఈసారి భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్ధిగా కారం పుల్లయ్య పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పొడెం వీరయ్యను తానే గెలిపించుకొంటానని పొంగులేటి హామీ ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్ధిగా కుంజ ధర్మారావు కూడా బరిలో ఉన్నారు. కనుక ఈసారి కూడా భద్రాచలం బిఆర్ఎస్‌కు దక్కకపోవచ్చు.


Related Post