బీజేపీ గెలిస్తే ఓకే... కానీ ఓడిపోతే ఈటల పరిస్థితి ఏమిటి?

November 18, 2023


img

ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ ప్రధానంగా బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మద్యనే సాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. దీంతో బీజేపీ మూడో స్థానంలో ఉంటోంది. కానీ ఈ ఎన్నికలలో తప్పకుండా గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు నమ్మకంగా చెపుతున్నారు.

గెలిస్తే ఓకే కానీ ఓడిపోతే తెలంగాణ బీజేపీలో దానికి నైతిక బాధ్యత ఎవరు తీసుకొంటారు?అంటే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అని అందరికీ తెలుసు. కానీ ఎన్నికలకు మూడు నెలల ముందు పార్టీ బాధ్యతలు చేపట్టిన ఆయన అందుకు బాధ్యులు కారని అందరికీ తెలుసు. మరైతే ఎవరు?అంటే బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ఇద్దరు కనిపిస్తున్నారు. 

బండి సంజయ్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ప్రజలు, పార్టీలో అందరూ, చివరికి బిఆర్ఎస్‌ పార్టీ కూడా బీజేపీని తమకు ప్రత్యామ్నాయంగా గుర్తించింది. ఒకవేళ బండి సంజయ్‌ అధ్యక్షుడుగా కొనసాగి ఉండి ఉంటే నేడు కాంగ్రెస్‌ స్థానంలో తెలంగాణ బిఆర్ఎస్‌ పార్టీతో పోరాడుతూ ఉండేది. అప్పుడు బీజేపీ విజయావకాశాలు కూడా ఉండేవి. 

కానీ బండి సంజయ్‌ని ఆ పదవిలో నుంచి తప్పించేసుకోవడంతోనే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి తేల్చి చెప్పేశారు. ఈటల రాజేందర్‌ అనే విషపు మొక్కని కేసీఆర్‌ బీజేపీలో నాటారని ఆయన కారణంగానే తెలంగాణలో బీజేపీ నాశనం కాబోతోందంటూ విజయశాంతి కుండ బద్దలుకొట్టారు. 

కనుక తెలంగాణలో బీజేపీ ఓడిపోతే దానికి నైతిక బాధ్యత ఈటల రాజేందర్‌ వహించాల్సి ఉంటుంది. ఆయన ఫిర్యాదుల వలననే బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌ని ఆ పదవిలో నుంచి తొలగించుకొని నష్టపోబోతోంది కనుక ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్‌ ఏమిటి?అంటే కాలమే జవాబు చెపుతుంది.


Related Post