విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీజేపీపై కొన్ని తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేటికీ బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి ఎందుకు తొలగించిందో బీజేపీ అధిష్టానం చెప్పనేలేదు. బీజేపీలో కేసీఆర్ ఈటల రాజేందర్ అనే విషపు మొక్కను నాటారు. అదే తెలంగాణ బీజేపీని నాశనం చేసేసింది.
కేసీఆర్‌పై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చినందునే నావంటివారు పలువురు బీజేపీలో చేరారు. నెలలు, సంవత్సరాలు దొర్లిపోయాయి. మోడీ, అమిత్ షాలతో సహా బీజేపీ నేతలందరూ కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని దానికి సంబందించిన సాక్ష్యాధారాలన్నీ మా వద్ద ఉన్నాయని మోడీ, అమిత్ షాలు చెపుతుంటారు. కానీ కేసీఆర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు. అదేవిదంగా ఈటల రాజేందర్‌పై కేసీఆర్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులన్నీ ఏమైపోయాయి? వాటిని కేసీఆర్ అటకెక్కించేశారు.
బిఆర్ఎస్, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉందని ఇవన్నీ నిరూపిస్తున్నాయి. బిఆర్ఎస్, బీజేపీ నేతలు తెర ముందు ఒకలా మాట్లాడుతుంటారు. తెర వెనుక మాట్లాడుకొనే మాటలు వేరే ఉంటాయి. మద్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పిచ్చోళ్ళుగా మిగిలిపోతుంటారు.
బీజేపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలూ తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంటాయి తప్ప ప్రజల గురించి ఆలోచించవు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడం చాలా అవసరం. అది బీజేపీ వల్ల కాదని నాకు అర్దమైంది. అందుకే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. కేసీఆర్‌ని గద్దె దించేందుకు ఎంత దూరమైనా వెళ్తాను. ఎంత పోరాటమైనా చేస్తాను,” అని అన్నారు.