పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉపఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించిన ఈటల రాజేందర్‌ను ఆయన ఢీకొనబోతున్నారు. కనుక ఆయన చాలా జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఆయనకు మద్దతుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులందరూ కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. హేమాహేమీల వంటి ఇంతమందిలో 12 ఏళ్ళు వయసున్న పాడి కౌశిక్ రెడ్డి కూతురు చేస్తున్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకట్టుకొంటోంది.
తండ్రితో పాటు రోడ్ షోలలో, వేలాదిమంది ప్రజలు పాల్గొనే బహిరంగ సభలలో ఏమాత్రం జంకుగొంకూ లేకుండా మాట్లాడుతోంది. అమె మాటలు విని ఆమె తల్లి తండ్రులు ఎలాగూ మురిసిపోతున్నారు... సభలకు హాజరయ్యే మహిళలు కూడా మురిసిపోతున్నారు.
హుజూరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ,”అందరూ చేతులు పైకి ఎత్తండి...” అంటూ వెనక్కు తిరిగి “వేదిక మీదున్న మీరందరూ కూడా...” అంటూ అనేసరికి అందరూ ముసిముసినవ్వులు నవ్వుకొంటూ చేతులు ఎత్తారు.
అప్పుడు ఆమె అందరి చేత ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేయించిన తర్వాత, “నాకిప్పుడు 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్ళలో మా డాడి రెండేళ్ళే నాతో గడిపారు. నా బర్త్ డేలకి కూడా డుమ్మా కొట్టి పదేళ్ళుగా మీ మద్యనే తిరుగుతున్నారు. ఎందుకంటే హుజూరాబాద్‌ని అభివృద్ధి చేసుకోవాలని చెపుతుండేవారు. మొదట్లో నాకు అర్దమయ్యేది కాదు. కానీ ఇప్పుడు బాగా అర్దమైంది.
కేసీఆర్ తాతగారు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే మన హుజూరాబాద్‌ని కూడా మా డాడీ అభివృద్ధి చేయాలని పట్టుదలగా ఉన్నారు. మీరందరూ మా డాడీకి ఓట్లేసి గెలిపిస్తే నేనే మా డాడీ వెంటపడి అభివృద్ధి చేయిస్తాను.
మీరందరూ మా డాడికీ ఓట్లు వేసిగెలిపిస్తారు కదా? మీ మీద నమ్మకం పెట్టుకొని వెళుతున్నాను. పక్కా గెలిపిస్తారు కదా?” అంటూ ఆ చిన్నారి ప్రసంగాన్ని హుజూరాబాద్ ప్రజలు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో చూస్తే మీరూ ఫిదా అవుతారు.