బిఆర్ఎస్, కాంగ్రెస్... ఏది గెలిచినా ఒకటే: బండి సంజయ్‌

November 18, 2023


img

బండి సంజయ్‌... తెలంగాణ ప్రజలకు పరిచయమే అవసరం లేని పేరు. రాష్ట్రంలో బీజేపీని అధికార ద్వారం వరకు తీసుకువెళ్ళిన ఏకైక వ్యక్తిగా, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులను ధీటుగా ఎదుర్కోగల మగాడుగా ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆయన ఓ ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల గురించి చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. 

“ఈ ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఓడిపోయే పరిస్థితే వస్తే కాంగ్రెస్ పార్టీ గెలవాలని కేసీఆర్‌ కోరుకొంటున్నారు. అలాగే కాంగ్రెస్‌ ఓడిపోయే పరిస్థితి వస్తే బిఆర్ఎస్‌ గెలవాలని కాంగ్రెస్‌ నేతలు కోరుకొంటున్నారు. ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో బీజేపీ గెలవకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌, మజ్లీస్‌ మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఒకదానికొకటి పరస్పరం సహకరించుకొంటున్నాయి. 

కాంగ్రెస్ అభ్యర్ధులలో 50 నుంచి 70 మందికి బిఆర్ఎస్‌ పార్టీయే ఎన్నికల ఖర్చులకు డబ్బు అందిస్తోంది. కనుక ఎన్నికల తర్వాత అవసరమైతే గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ బిఆర్ఎస్‌ పార్టీలో చేరిపోవడం ఖాయం. 

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. అలాగే ఆ పార్టీలో ఆరుగురు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా పార్టీ చీలిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. లేదా మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కనుక రాష్ట్రంలో బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలలో ఏది గెలిచినా ఒక్కటే!” అని బండి సంజయ్‌ అన్నారు. 

ఇంకా అనేక ఇతర అంశాలపై కూడా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. కానీ కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ పార్టీలలో ఏదో ఒకటి గెలిస్తే లేదా రెంటికీ పూర్తి మెజార్టీ రాకపోతే ఏమవుతుందో బండి సంజయ్‌ చక్కగా చెప్పారనుకోవచ్చు.


Related Post