కాంగ్రెస్‌ గూటికి విజయశాంతి... ఇదే చివరి మజిలీ?

November 17, 2023


img

ప్రముఖ నటి, మహిళా రాజకీయ నాయకురాలు విజయశాంతి, బీజేపీకి రాజీనామా చేసి నేడు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీలో ఆమెకు సముచిత గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తితో ఆమె పార్టీని వీడారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ను గద్దె దించేందుకు పోరాడుతున్న శక్తులన్నీ ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది కనుక  అందుకు గట్టి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను,” అని అన్నారు. 

విజయశాంతి 1998లో బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2009లో ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించి తెలంగాణ సాధన కోసం ప్రయత్నించారు. కానీ కేసీఆర్‌ ఆహ్వానం మేరకు తన పార్టీని బిఆర్ఎస్‌లో విలీనం చేశారు. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆమె బిఆర్ఎస్‌ అభ్యర్ధిగా మెదక్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కేసీఆర్‌ ఆమెను పక్కన పెడుతుండటంతో ఆమె 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక 2020లో రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలో చేరారు. మూడేళ్ళయ్యేసరికి బీజేపీలో ఇమడలేక మళ్ళీ ఈరోజు కాంగ్రెస్‌ గూటికి చేరుకొన్నారు. రాజకీయాలలో ఆమెకు బహుశః ఇదే చివరి మజిలీ అవుతుందా లేక మున్ముందు మళ్ళీ పార్టీ మారుతారో చూడాలి.


Related Post