బీజేపీ మహిళా నేత విజయశాంతి కీలకమైన ఎన్నికల ప్రచార సమయంలో పార్టీకి దూరంగా ఉండిపోయారు. అని అనే కంటే పార్టీయే ఆమెను దూరం పెట్టిందని చెప్పవచ్చు. ఈ కారణంగా ఆమె నేటికీ బీజేపీలోనే కొనసాగుతున్నప్పటికీ, కాంగ్రెస్‌కు మద్దతుగా నర్మగర్భంగా ట్వీట్స్ చేస్తున్నారు.
తెలంగాణ సాధన కోసం పోరాడిన యోధురాలిగా తాను పొరుగు రాష్ట్రాల పార్టీలు తెలంగాణలో రాజకీయాలు చేయడాన్ని వ్యతిరేకిస్తానని ట్వీట్ చేశారు. ఈ విషయం ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నా టిడిపికి, ఏపీలో విస్తరించాలనుకొన్న బిఆర్ఎస్ పార్టీలకి అర్దమైన్నట్లే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ఆంధ్రా ప్రజలను ‘సెటిలర్స్’ అంటూ వేరు చేసి చూడటం, వారందరినీ ఏదో ఓ పార్టీకి చెందిన ఓటు బ్యాంక్ అని భావించడం సరికాదని ట్వీట్ చేశారు. ప్రాంతాలు వేరైనప్పటికీ మనమందరం ఒకే భరతజాతి బిడ్డలంగా కలిసిమెలిసి ఉండాలని ట్వీట్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తన ఓటు బ్యాంక్ మళ్ళించి అది గెలిచేందుకు తోడ్పడేందుకే టిడిపి ఎన్నికలకు దూరంగా ఉండిపోయిందని బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. కనుక టిడిపి నిర్ణయాన్ని వేరే కోణంలో చూపుతూ దాని నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు విజయశాంతి ట్వీట్ చేశారనుకోవచ్చు. అంటే పరోక్షంగా ఆమె కాంగ్రెస్ పార్టీని సమర్ధిస్తున్నట్లు భావించవచ్చు. ఇంతకీ ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే..
“తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదే. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు. అది, ఎప్పటికీ నిరూపితమైన వాస్తవం.
అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుండి వచ్చి.. ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం ఎంతమాత్రం సరికాదు. ఈ అంశం తెలంగాణల తెలుగుదేశం పార్టీకి కూడా అవగతమైన దృష్ట్యా ఎన్నికలకు ఇక్కడ దూరమైనట్లు తెలుస్తున్నది. అట్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కూడా దూరం ఉన్నట్లు తెలుస్తున్నది.
వాస్తవం, పార్టీల ప్రయోజనాలు వేరు... ప్రజా ప్రయోజనాలు వేరు. ఏ ప్రాంతం వారైనప్పటికీ, భారత జాతిగా.. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నిలబడేలా చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటం సమాఖ్య వ్యవస్థలో మనందరి విధి. అందుకే, కోవిడ్ కష్టకాలంలో, ప్రాణాపాయంలో ఉండి అంబులెన్స్‌లల్ల వస్తున్న ఆంధ్ర ప్రాంత వైద్య అవసర బాధితులు హైదరాబాద్ హాస్పిటల్స్‌కు రాకుండా, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తెలియక పోలీసులు అడ్డుకున్న నాడు, వారిని తక్షణం వదలకుంటే, ఎంతటి కొట్లాటకైనా సిద్ధపడతానని చెప్పినది రాములమ్మేనన్న జ్ఞాపకం ఇప్పటికీ అందరికీ సజీవమే... జై శ్రీరామ్ హర హర మహాదేవ జై తెలంగాణ విజయశాంతి.”