కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ మంచి వాక్చాతుర్యం ఉంది. అదే మరోసారి నిరూపిస్తున్నట్లు సాగింది వేములవాడలో మంత్రి కేటీఆర్ ప్రసంగం. బిఆర్ఎస్ అభ్యర్ధి చల్మెడ లక్ష్మీ నరసింహారావుకి మద్దతుగా ఈరోజు వేములవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనింట్లో ఓ ఆడబిడ్డ అంటే చెల్లో, కూతురో, మేనకోడలికో మనం పెళ్ళి చేయాలనుకొన్నప్పుడు ఏం చేస్తాం? కుర్రాడు ఎర్రబుర్రగా ఉన్నాడని ఇచ్చి పెళ్ళి చేసేయము కదా?అతనికి ఏమైనా చెడు వ్యసనాలు ఉన్నాయా?ఉద్యోగం సద్యోగం ఏమైనా చేస్తున్నాడా లేదా?అతని కుటుంబం ఎలాంటిది?వంటి వివరాలన్నీ తెలుసుకొన్నాక అన్ని మంచిగా ఉంటేనే మన పిల్లనిచ్చి పెళ్ళి చేస్తాము కదా?
అలాగే ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకొన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కూమొహం తెలీని వాళ్ళ మాయమాటలు నమ్మి ఎవరి చేతిలోనో ఎలా పెట్టేస్తాం? తెలంగాణ ఏర్పడిన తర్వాత మద్యలో ఓ రెండేళ్ళు కరోనాతో, మరో ఏడాది పాటు వరుస ఎన్నికలతో రాష్ట్రాభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మిగిలిన ఈ ఆరున్నరేళ్ళ కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విదాలా అభివృద్ధి చేసుకొని దేశంలోనే నంబర్:1 స్థానంలో నిలుపుకొన్నాము.
కనుక మనకి బిఆర్ఎస్ పార్టీ మంచిదా లేక మాయమాటలు చెప్పి తెలంగాణను దోచుకుపోయేందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీలు మంచివా?మీరే ఆలోచించుకొని ఓట్లు వేయండి. ఎన్నికలు రాగానే ఎవరెవరో వచ్చిపోతుంటారు. ఏవేవో మాయమాటలు చెప్పి మనల్ని నమ్మించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ మీ కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని మాత్రమే చూసి ఓట్లు వేయండి. కాదని తప్పుడు నిర్ణయం తీసుకొంటే తర్వాత అందరూ బాధపడాల్సి ఉంటుంది,” అని అన్నారు.
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టిన్నట్లు కేటీఆర్ ఇంత చక్కగా చెపుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు వింకుండా ఉంటారా లేదా? డిసెంబర్ 3న తెలుస్తుంది.