మొన్న ఖమ్మంలో టిడిపి అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తుమ్మల ఒకప్పుడు టిడిపిలోనే ఉన్నందున ఏపీ నుంచి వచ్చిన టిడిపి నేతలు, తెలంగాణ టిడిపి నేతలు కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమం వారు ఆయన మెడలో (టిడిపి) పచ్చ కండువా వేశారు.
తుమ్మల ఆ కండువాని చూపిస్తూ, “నాకు ఇంత గుర్తింపునిచ్చిన దీనికి నేను ఎల్లప్పుడు ఋణపడి ఉంటాను. ఖమ్మంలో నా గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మీ రుణం నేను ఉంచుకోను. ఇక్కడ నేను గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి గెలిచి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయమే,” అని అన్నారు.
ఈసారి శాసనసభ ఎన్నికలలో 82 స్థానాలకు టిడిపి పోటీ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు నాయుడుకి ప్రతిపాదించారు. కానీ ఆయన ఈసారి అసలు పోటీ చేయవద్దని చెప్పేశారు. దీంతో కాసాని పార్టీకి, అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తోడ్పటడం కోసమే టిడిపి ఎన్నికల బరిలో నుంచి తప్పుకొందని ఆయన ఆరోపించారు.
తుమ్మల నాగేశ్వరరావుకి టిడిపి నేతలు మద్దతు ఇచ్చి ఆయనను గెలిపించుకొనేందుకు కృషి చేస్తుండటం, దాని గురించి తుమ్మల చెప్పినది వింటే అది నిజమేనని అర్దమవుతోంది కదా?